సుందరకాండ...! అది ఓ మానసిక విశ్లేషణా శాస్త్రం!

"బుద్ధిర్బలం యశో ధైర్యం, నిర్భయత్వ మరోగతాః! 

అజాఢ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాద్భవేత్"

             

                                                                                         


అసలు పూర్తిగా రామాయణమే ఒక సంపూర్ణ మానసిక శాస్త్రం. అందునా సుందరకాండ బహు సుందరంగా మానసిక సంఘర్షణను చూపించి విజయానికి ఎలా పయనమవ్వాలో నిరూపిస్తుంది. అసలు రామాయణమే ఒక జీవి ఆధ్యాత్మిక జీవితానికి దర్పణం. అయోధ్యలో ప్రజలు ఎంత గొప్పవారో వివరిస్తారు. ధర్మం గురించి చెబుతారు. 

అదే లంకలో నగరం ఎంత సుందరమో చెబుతారు. ఇక్కడ భౌతిక౦గా ఎంత ఉన్నతంగా ఈనగరం వుందో విశ్లేషణ చేస్తే అయోధ్యలో ధార్మికత, ఆధ్యాత్మికత గురించి చెబుతారు వాల్మీకి మహర్షి.  దశరధుడు అన్నదే పంచకోశ పాంచ భౌతిక శరీరం, అతడి ముగ్గురు భార్యలే ఆజీవికి సంబంధిత ప్రారబ్ధ, సంచిత, ఆగామి కర్మలతో యజ్ఞం చేసి ధర్మార్ధకామమొక్షాలనే చతుర్విధపురుషార్థాలు సాధించడం! అదే లంకలో రజో గుణ దశకంఠ రావణుడు, తమోగుణ కుంభకర్ణుని మట్టుబెట్టి సత్త్వ గుణవిభీషణుని నిలబెట్టడం. 

మన మనస్సులో ఆలోచనలే ఒక పెద్ద వానర సమూహం, దాన్ని నియంత్రించి కామం దాచిన జీవాత్మను పరమాత్మకు చేర్చడమే లంకా పయన, రావణ సంహార ఘట్టం. నూరు యోజనాలు దాటడానికి తనకున్న బలం మీద నమ్మకం లేకపోతే జాంబవంతుడు అతడికి తన బలం గురించి తెలియ చేస్తే రివ్వున లంకకు పయనమయ్యాడు పవనసుతుడు. ఆయన ఎన్నో చోట్ల తల్లి సీతమ్మ  కోసం వెతుకుతాడు. చూడరాని ఎన్నో సన్నివేశాలను చూసాడు. కానీ తనకు మానసిక దౌర్భాల్యం, లౌక్యం లేదని సమాధానపడి సీతమ్మ కోసం వెతుకుతూ తిరుగుతుంటాడు స్వామి హనుమ. 

ఎంత వెదకినా తల్లి కనబడక ఎంతో నిరాశకు గురవుతాడు. అసలు తల్లి దొరకకపోతే తాను అక్కడే వుండి తపస్సు చేసుకుందామని, లేదా ప్రాయోపవేశం చేసి తనువు చాలిద్దామని ఎన్నో ఆలోచనలు. అందునా కొన్ని కొన్ని సందర్భాలలో ఎంతో నిస్పృహకు గురయ్యి సాక్షాత్తు హనుమంతుల వారే ఆత్మహత్య గురించి ఆలోచిస్తారు. దాని నుండి ఎలా బయటపడాలో ఆయన ద్వారా చూపెడతారు వాల్మీకి. ఎక్కడికక్కడ సమాధాన పరుచుకుంటూ ముందుకు కదులుతాడు. జీవించి వుంటే ఎప్పటికైనా విజయం సాధ్యం అవుతుందని హనుమంతుని ఆలోచన ద్వారా మనకు సందేశం ఇస్తాడు మహర్షి. 

ఒకానొక సమయంలో ఈ రాక్షసులు సీతమ్మను తినేసారా అని భీతిల్లి తానక్కడ నిరాహారంగా నిర్వాణం పొందుదామని ఆలోచిస్తాడు. ఇంతలో వివేకం తొంగి చూసి అసలు దీనికి కారణం అయిన రావణుని చంపి పాతరేద్దామని, లేదా కట్టి తీసుకెళ్ళి రాముని ముందు పడేద్దామని మరల రోమాంచితుడవుతాడు. 

చివరకు హనుమంతునికి సీతమ్మ దర్శనం అవుతుంది. ఎంత గొప్పవారికైనా క్లేశాలు తప్పవు, అసలు సీతమ్మే ఇటువంటి స్థితికి వచ్చిందంటే కాలం ఎంత బలీయమైనదో  అని అనుకుంటాడు. 

ఇక్కడ ఒక కార్యం సాధించవలసి వచ్చినప్పుడు మనకు కూడా ఎదురయ్యే సంగతులే. ఎంతో ప్రయత్నం చేసినా కొన్ని సార్లు ఎక్కడా కూడా మనం ఆ ఫలితం కనబడడం లేదని డీలా పడిపోతాము. మరికొంత ప్రయత్నం చేస్తే సాధించవచ్చు అన్న ధైర్యాన్ని కోల్పోతాము. మనవంటి వారికి ధైర్యం చెప్పడానికి అతి బలవంతుడైన హనుమంతునే ఎదురుగా పెట్టి మనకు పాఠం నేర్పుతారు. ఎన్నటికీ ధైర్యం కోల్పోకూడదని, సమయం ఆసన్నమైనప్పుడు, మన ప్రయత్న లోపం ఏమీ లేనప్పుడు తప్పక మనకు ఫలితం దక్కుతుంది. మన వాంగ్మయం మనకు ధైర్యాన్నే నేర్పుతుంది. 

స్వామీ వివేకానందుల వారు అన్నట్టు మన వేదం మొత్తం కేవలం ధైర్యం, సంకల్ప బలం గురించి మాత్రమె చెబుతుంది. దైవం మీద భారం వేసి త్రికరణ శుద్ధిగా మనం ప్రయత్నిస్తే తప్పక విజయం సాధిస్తాం. ఎప్పుడైనా కొంత మనకు నమ్మకం సన్నగిల్లినప్పుడు, ఎంత ప్రయత్నం చేస్తున్నా ఫలితం రానప్పుడు పెద్దలు సుందరకాండ పారాయణం చెయ్యమంటారు. 

ఆ పారాయణం వలన ఆ మంత్రరాజ ఫలితంగా ఆధిదైవిక అడ్డంకులు ఏమున్నాయో అవి తొలగిపోతాయి. ఆ ఘట్టాలు మనం పూర్తిగా చదవడం వలన తత్త్వం బోధ పడి, మనమీద మనకు నమ్మకం కుదిరి మన ప్రయత్నాలను మరింత జాగ్రత్తగా పదును పెట్టి ముందుకు వెళ్లి విజయాన్ని సాధించగలుగుతాము._

                                                                           Courtesy ----  Chiluveru Ramchandra Murthy




నేను లేకపోతే?

అశోక వనంలో రావణుడు... సీతమ్మ వారి మీదకోపంతో... కత్తి దూసి, ఆమెను చంపటానికి ముందుకు వెళ్ళినప్పుడు.... హనుమంతుడు అనుకున్నాడు 'ఎవరి నుంచైనా కత్తిని తీసుకుని  రావణాసురుని తలను ఖండించాలి' అని

కానీ మరుక్షణంలోనే మండోదరి... రావణుడి చేతిని పట్టుకొని ఆపడాన్ని చూశాడు! 
 ఆశ్చర్య చకితుడయ్యాడు. 

'"నేనే కనుక ఇక్కడ లేకపోతే... సీతమ్మను  రక్షించే వారెవరు... అనేది నా భ్రమ అన్నమాట" అనుకున్నాడు హనుమంతుడు! 
బహుశా మనం కూడా ఎన్నోసార్లు ఇలానే అనుకుని ఉంటాం,  'నేను లేకపోతే ఎలా?' అని. 
 సీతామాతను రక్షించే పనిని, ప్రభువు ఏకంగా రావణుని భార్యకు అప్పగించాడు. 
అప్పుడు హనుమంతుడు కి అర్థమైంది  'ఎవరి ద్వారా ఏ కార్యాన్ని  చేయించుకోవాలో... వారి ద్వారానే ప్రభువు ఆపని చేయించుకుంటాడు' అని. 
**మరింత ముందుకు వెళితే 
త్రిజట ....తనకు ఒక కల వచ్చిందని, ఆ కలలో లంకకు ఒక కోతి వస్తుందనీ, అది లంకను కాల్చివేస్తుందనీ..దాన్ని నేను చూశాను ....అనీ చెప్పింది. 
అయితే హనుమంతుడికి ఇది చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ప్రభువు తనను సీతను చూసి మాత్రమే రమ్మన్నాడు, అంతేకానీ లంకను కాల్చి రమ్మని చెప్పలేదు. 
తాను లంకను కాల్చడం ఎలా సాధ్యం.. అనుకున్నాడు

అయితే త్రిజట ఇది తన స్వప్నంలో చూశాను ...అని చెప్పింది. హనుమంతుడు ధర్మ మీమాంసలో పడ్డాడు... తను ఇప్పుడు ఏం చేయాలి? సరే, ప్రభువు ఇచ్ఛ ఎలా ఉంటే అలా జరుగుతుంది.... అనుకున్నాడు. 
*
హనుమంతుని చంపడానికి రావణుడి సైనికులు పరిగెత్తుకొని వస్తున్నప్పుడు... హనుమంతుడు ఏమి చేయలేదు. అలా నిలబడ్డాడు. 
అయితే ఆ సమయంలో విభీషణుడు వచ్చి 'అన్నా! దూతను చంపటం నీతి కాదు' అన్నాడు. 
అప్పుడు హనుమంతునికి అర్థమైంది, తనను రక్షించే భారం ప్రభువు విభీషణుని  పై ఉంచాడు అని. 
ఆశ్చర్యానికి పరాకాష్ట ఎక్కడంటే .... విభీషణుడు ఆ మాట చెప్పగానే... రావణుడు  ఒప్పుకుని 'కోతిని చంపొద్దు. కోతులకు తోకంటే మహా ఇష్టం . తోకకు నిప్పు పెట్ట0డి' అన్నాడు.

అప్పుడు హనుమంతుడికి మరింతగా అర్థమైంది త్రిజట స్వప్నం నిజం కాబోతుంది అని. "ప్రభువు నాకే చెప్పి ఉంటే... నేను ఎక్కడి నుంచి నూనె తీసుకురావాలి, ఎక్కడి నుంచి గుడ్డలు తీసుకురావాలి, ఎక్కడి నుంచి నిప్పు తీసుకురావాలి, ఎప్పుడు లంకను తగలబెట్టాలి! "ఆలోచనల వరంపరతో ఆశ్చర్యంలో మునిగిపోయాడు.

పరమాశ్చర్యం ఏంటంటే... వాటన్నిటికే ఏర్పాట్లు... రావణుడే స్వయంగా చేయించాడు. 
అంటే, రావణునితో కూడా తన పనిని చేయించుకోగలిగిన తన ప్రభువు ....తనకు"లంకను చూసి రా"అని మాత్రమే ఆజ్ఞాపించడంలో ఆశ్చర్యం ఏముంది! 
**
అందుకే ప్రియ భక్తులారా! ఒకటి గుర్తుంచుకోండి. 

ప్రపంచంలో జరుగుతున్నదంతా ఈశ్వరేచ్ఛ ప్రకారమే జరుగుతుంది. మనమంతా కేవలం నిమిత్తమాత్రులం .
అందువల్ల 

* నేను లేకపోతే ఏమవుతుందో* 

అన్న భ్రమలో ఎప్పుడూ పడవద్దు 
'నేనే గొప్పవాడి'నని గర్వపడవద్దు. 

*భగవంతుడి కోటానుకోట్ల దాసులలో 
అతి చిన్నవాడను* 

అని   ఎఱుక       కలిగి ఉందాం.🙏

**********************************************************************************

మానవాళికి ఎక్కువ లబ్ది చేకూరాలంటే ఏయే చెట్లు నాటాలి.?

 స్కంద పురాణంలో  ఒక చక్కని శ్లోకం ఉంది.

అశ్వత్థమేకం పిచుమందమేకం
న్యగ్రోధమేకం దశ తిన్త్రిణీకం|
కపిత్థ బిల్వాఁ మలకత్రయాంచ పంచామ్రవాపీ నరకన్ న పశ్యేత్||.

అశ్వత్థ =  రావి  (100% కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్రహిస్తుంది) 

 పిచుమందా = నిమ్మ (80% కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్రహిస్తుంది)

న్యగ్రోధ = మర్రి చెట్టు (80% కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్రహిస్తుంది) 

తింత్రిణి = చింత (80% కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్రహిస్తుంది) 

కపిత్థ = వెలగ (80% కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహిస్తుంది) 

బిల్వ = మారేడు  (85% కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహిస్తుంది) 

అమలకా = ఉసిరి (74% కార్బన్ డయాక్సైడ్ గ్రహిస్తుంది) 
 ఆమ్రాహ్ = మామిడి (70% కార్బండయాక్సైడ్ గ్రహిస్తుంది) 
  వాపి  - నుయ్యి 

అర్థం 
ఈ చెట్లను నాటి  ఒక దిగుడు బావి నిర్మించి సంరక్షించినవారు నరకం చూడవలసిన అవసరం ఉండదు.
--------------------------------------

 (ప్రస్తుత కలుషిత వాతావరణం)

మొక్కలు నాటడం ఆగిపోవడంతో కరువు సమస్య పెరుగుతోంది.

ఈ చెట్లన్నీ వాతావరణంలో ఆక్సిజన్‌ను పెంచుతాయి. 
అలాగే, ఇవి భూమి ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి.

ఈ చెట్లను పూజించే సంప్రదాయాన్ని మూఢ నమ్మకాలుగా భావించి, విదేశీ సంస్కృతి పేరుతో ఈ చెట్లను దూరం చేసుకుని క్వటర్స్ చెట్లు పెంచుతున్నాం.
-------------------------------

మూలే బ్రహ్మ చర్మం విష్ణు శాఖ శంకరమేవచ|

పత్రే పత్రే సర్వదేవయం వృక్ష రాజ్ఞో నమోస్తుతే||

భావం: ఏ మూలంలో బ్రహ్మ, కాండములో విష్ణువు, శాఖలలో  శంకరుడు, ఆకులలో సర్వ దేవతలు నివసిస్తారో అటువంటి వృక్షరాజం రావిచెట్టుకి నమస్కారాలు.

గ్రంథాలలో, రావి చెట్టుని చెట్లరాజు అని పిలుస్తారు.

రాబోయే సంవత్సరాల్లో  రావి, మర్రి, వేప, మారేడు, ఉసిరి చెట్లను నాటితేనే మన భారతదేశం కాలుష్య రహితంగా మారుతుంది.

మన సంఘటిత ప్రయత్నాల ద్వారానే మన భారతదేశాన్ని ప్రకృతి వైపరీత్యాల నుండి కాపాడుకోగలము.

భవిష్యత్తులో మనకు సహజ ప్రాణవాయువు సమృద్ధిగా అందేలా ఈరోజు నుంచే మొక్కలు నాటడం ప్రారంభించాల్సిన అవసరం ఉంది.

 మొక్కలు నాటడం ద్వారా రాబోయే తరానికి ఆరోగ్యకరమైన  పర్యావరణాన్ని అందించడానికి ప్రయత్నిద్దాం.

🌳🥦🌴🌲
                                                                                    Courtesy : Mr. C.Ramchandra Murthy

Comments

Popular posts from this blog

A B V High School Friends Stories -1

Gajendra Moksham- Courtesy Dr. Mahendra Raju

Bhagavad-Gita (Purushottama Yoga 15.1 shloka